అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు అసలు సభలకు రాకుండానే జీతాలు, భత్యాలు తీసుకుంటున్నారని.. అలాంటి వారి సభ్యత్వాలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రు డు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరుగుతున్న అఖిల భారత స్పీకర్ల సదస్సులో శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. 2024లో ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన కొందరు సభ్యులు(వైసీపీ) ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సభకు రాలేదని తెలిపారు. ఇలా రాకుండా ఉండడం అంటే.. అటు ప్రజలను, ఇటు సభను కూడా అవమానించడమేనన్నారు. ఇలాంటి వారికి ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి గౌరవం లేనట్టేనన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా సభకు రాకుండానే సభ్యులు వేతనాలు.. భత్యాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని స్పీకర్ తెలిపారు. ప్రజలు కడుతున్న పన్నులతోనే సభ్యులకు వేతనాలు చెల్లిస్తున్నామని.. కానీ.. సభకురాకుండా వేతనం తీసుకోవడం సరికాదన్నారు. దీనిపై కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో వివరించారు. అలాగే.. ఏడాదిలో కనీసం 60 రోజుల పాటు సభలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
కేవలం తూతూ మంత్రంగా సభలను పెట్టి.. నిబంధనల ప్రకారం ముగించడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై అందరూ ఒక నిర్ణయం తీసుకుని ఏడాదికి 60 రోజుల పాటు సభలు నిర్వహించేలా చూడాలన్నారు. అలాగే.. సభ్యుల నైతిక ప్రవర్తనపై కూడా అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏపీ సభలను దారుణంగా మార్చారంటూ.. వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. పదిమందికీ సభ్యులు ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు.