సినీ పరిశ్రమను ఒక్కసారిగా విషాదంలోకి నెట్టిన దుర్ఘటన ఇది. కన్నడ సినీ రంగంలో దర్శకుడిగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న కీర్తన్ నాదగౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కీర్తన్, సమృద్ధి దంపతుల నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడ ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించిందని సమాచారం. చిన్న వయసులోనే సోనార్ష్ అకాలంగా కన్నుమూయడం కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. చిన్నారి సోనార్ష్ మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని కుటుంబం తట్టుకునేలా దేవుడు ధైర్యం ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
కీర్తన్ నాదగౌడ కన్నడ సినీ పరిశ్రమలో అనేక ప్రముఖ చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాడు. ముఖ్యంగా కన్నడ పాన్ ఇండియా సెన్సేషన్ ‘కేజీఎఫ్’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేసి మంచి గుర్తింపు సంపాదించారు. ఈ అనుభవంతోనే స్వతంత్ర దర్శకుడిగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందనున్న హారర్ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి తరుణంలో కుమారుడి మరణం కీర్తన్ కుటుంబానికి నిజంగా తీరని లోటుగా మారింది.