 
    కరడు గట్టిన నేరస్తుడు రియాజ్ ఎన్ కౌంటర్‌ను మరిచిపోకముందే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు తుపాకీకి పని చెప్పారు. ఈ ఘటన కూడా.. దొంగతనంతో ముడిపడిన వ్యవహారమే కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతం చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో మీదుగా.. హైదరాబాద్ ఆగ్నేయ విభాగం డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వస్తున్నారు. ఈ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఎప్పటి నుంచో వాంటెడ్‌గా ఉన్న సెల్ ఫోన్‌దొంగలు ఇద్దరు డీసీపీ చైతన్య కంట్లో పడ్డారు. వెంటనే ఆయన తన వాహనాన్ని ఆపి .. సెక్యూరిటీ సిబ్బందిని సదరు దొంగలను పట్టుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో వారిని చూసిన దొంగలు.. పరుగు లంఘించుకున్నారు. దీంతో తాను కూడా స్వయంగా కారు దిగి దొంగలను వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా.. దొంగల్లో ఒకరు చేతిలో ఉన్న కత్తిని డీసీపీపై విసిరారు. ఇది ఆయన చేతికి తగలడంతో ఆయన అక్కడికక్కడే పడిపోయారు.
అయితే.. వెంటనే పైకి లేచి.. దొంగలకు తన వద్ద ఉన్న తుపాకీని గురి పెట్టారు. ఈ ఘటనలో ఒక దొంగ పరారవగా.. తుపాకీ తూటా మరో దొంగ కాలికి తగిలి.. అతను కుప్పకూలాడు. దీంతో డీసీపీ సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కాలికి తూటా గాయం కావడంతో అతనిని సమీపంలోని నాంపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన చాదర్‌ఘాట్ పోలీసులు.. రంగంలొకి దిగి పారిపోయిన దొంగ కోసం వెతుకులాట ప్రారంభించారు.
మరోవైపు.. దొంగ విసిరిన కత్తితో డీసీపీ చేతికి కూడా గాయం కావడంతో ఆయనకు కూడా అక్కడే ప్రాధమిక చికిత్స చేయించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. స్థానికంగా దొంగతనాలు పెరిగిపోవడం.. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల దొంగలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా కమిషనర్ ఆఫీసులో మీటింగుకు వెళ్లి వస్తున్న క్రమంలో డీసీపీ చైతన్య వాంటెడ్ దొంగలను పట్టుకునే క్రమంలో ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.