క‌విత వ్యాఖ్య‌లు.. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు..!!

admin
Published by Admin — October 26, 2025 in Telangana
News Image

నిజామాబాద్ నుంచి జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు.. జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత‌. ఈ క్ర‌మంలో ఆమె రాజ‌కీయంగా చేసిన వ్యాఖ్య‌లు స‌హ‌జంగా విమ‌ర్శ‌ల‌కు, లేదా ప్ర‌సంశ‌ల‌కు గురి కావాలి. కానీ.. నెటిజ‌న్ల నుంచి ట్రోల్స్‌కు గుర‌య్యాయి. దీనికి కార‌ణం.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. అవే అంశాల‌పై ఆమె స్పందించ‌క పోవ‌డం. అంతేకాదు.. ఇప్పుడు ఏయే అంశాల‌ను క‌విత ప్ర‌స్తావిస్తున్నారో.. తాను ఎంపీగా ఉన్న‌ప్పుడు.. త‌న తండ్రి సీఎంగా ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఒక‌ర‌కంగా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ర‌కంగా!

+ క‌విత‌: 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో కుట్ర చేసి ఓడించారు. ఎవ‌రు కుట్ర చేశారో.. మీకు తెలుసు(ప్ర‌జ‌లు).

+ నెటిజ‌న్లు: ఓడిపోయిన త‌ర్వాత‌.. ఏడాది పాటు బీఆర్ ఎస్‌లోనే ఉన్న విష‌యాన్ని మేం మ‌రిచిపోలేదు. ఇప్పుడు.. కొత్త‌గా చెప్పేది ఏముంది?. కుట్ర‌లు చేసింది.. సొంత పార్టీ నాయ‌కులు.. అయితే.. వారిని అప్ప‌ట్లోనే ప్ర‌శ్నించి ఉండాల్సిందిక‌దా!.

+ క‌విత‌: నా దారి నేను వెతుక్కుంటున్నా.

నెటిజ‌న్లు: కోరిన ప‌ద‌వి ఇచ్చి ఉంటే.. ఈ దారులు వెతికేవారా?.(మండ‌లిలో బీఆర్ ఎస్ ప‌క్ష నాయ‌కురాలి ప‌ద‌విని కోరుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది.)

+ క‌విత‌: నిజామాబాద్ కోడ‌లిగా మీముందుకు వ‌చ్చా. ఆశీర్వ‌దించండి.

నెటిజ‌న్లు: గ‌త 2019-24 మ‌ధ్య ఏం చేశారు? ఎన్ని సార్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఎన్ని క‌ష్టాలు తీర్చారు. ప‌స‌పు బోర్డుపై కుప్పిగంతులు వేయ‌లేదా?(అప్ప‌ట్లో ప‌సుపు బోర్డు ఉద్య‌మం నేప‌థ్యంలో).

+ క‌విత‌: ఎన్నో అవ‌మానాలు భ‌రించా?

నెటిజ‌న్లు: ఎవ‌రి కోసం భ‌రించారో కూడా జాబితా చెప్పాలి. మీ కుటుంబ లొల్లిని మీరు తెలంగాణ బాధ‌గా మారుస్తున్నారే.

+ క‌విత‌: అమ‌ర వీరుల‌(తెలంగాణ‌) కుటుంబాల‌కు ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌లేదు. వాటి కోసం పోరాటం చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది.

నెటిజ‌న్లు: గ‌త పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇదే విధంగా స్పందించి ఉంటే.. త‌ప్ప‌కుండా న‌మ్మేవాళ్లం. కానీ.. అప్ప‌ట్లో ఇదే అమ‌ర వీరుల కుటుంబాల‌కు అన్యాయం జ‌రిగిన‌ప్పుడు మీరు ఢిల్లీలో ఏం చేశారో అంద‌రికీ తెలుసు.

+ క‌విత‌: ప్ర‌తి ఒక్క‌రికీ ఆత్మ‌గౌర‌వంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటున్నా.

నెటిజ‌న్లు: గ‌త ప‌దేళ్ల‌లో ఏం చేశారు? ఎవ‌రి ఆత్మ గౌర‌వం.. ఎవ‌రి అభివృద్ధి కోసం కృషి చేశారు.? ముందు చెప్పాలి క‌దా!?.

కొస‌మెరుపు:

మొత్తంగా వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై పార్టీల‌కు అతీతంగా నెటిజ‌న్లు.. తెలంగాణ స‌మాజం ఇవే ప్ర‌శ్న‌లు సంధించింది. క‌వితకు ఒక‌ర‌కంగా ఇబ్బందిక‌ర‌మే అయినా.. తెలంగాణ స‌మాజంలో జ‌రుగుతున్న చ‌ర్చ అయితే.. వీరి ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

Tags
Kalvakuntla kavita comments netizens counter
Recent Comments
Leave a Comment

Related News