ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా పచ్చటి పంట పొలాలను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు. అవసరమైతే మరి కొన్ని వేల ఎకరాల భూమిని సైతం త్యాగం చేసేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే, అమరావతి రైతులపై కక్షగట్టిన జగన్ సర్కార్ గతంలో నానా ఇక్కట్లు పెట్టింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణం కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది.
ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అని ఉండటంతో వాటిని అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ విషయంపై మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
రైతులందరికీ పట్టా పేరిట ప్లాట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారం అందుకు సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తాజాగా జీవో విడుదల చేశారు. దీంతో, అమరావతి కోసం అసైన్డ్ భూములు త్యాగం చేసిన రైతులకు భారీ ఊరట లభించినట్లయింది. తమ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.