సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఇస్తానని తనకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆ తర్వాత మాట తప్పిందని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానాన్ని సైతం పలుమార్లు విమర్శించారు. అయితే, రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీపై మరోసారి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతను ఉద్యోగాలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, నేపాల్ తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత కూల్చడం ఖాయమని జోస్యం చెప్పారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ మనుగడ సాధించలేదని, అందుకు నేపాల్ ప్రభుత్వం కుప్పకూలడమే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉద్యోగాల భర్తీలు, హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణలో 30 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని, అన్నగా వారికి అండగా ఉంటానని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నేపాల్ తరహాలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై కూడా యువత తిరుగుబాటు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నిరుద్యోగ యువతతో కలిసి నివాళులర్పించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటి పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.