సైబర్ నేరాలకు హద్దు అదుపులేకుండా పోయింది. వారు వీరు అనే తేడా కూడా లేదు. అవకాశం ఉన్న ప్రతి చోటా.. సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా.. జనాల సొమ్మును సైబర్ నేరగాళ్లు లాగేస్తున్నారు. ఈ పరంపరలో తాజాగా జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా బాధితుడిగా మారారు. ఏకంగా.. ఆయన నుంచి కూడా 92.5 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వివిధ బ్యాంకు ఖాతాలకు బదలాయించుకున్నారు. చివరకు విషయం తెలుసుకునే సరికి.. కేవలం 7 లక్షలు మాత్రమే ఆపగలిగారు. రాజకీయంగానే కాదు.. అన్ని వర్గాల్లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది.
ఏం జరిగింది?
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. గత 2024 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరఫున విజయం దక్కించుకున్నారు. దీనికి ముందే ఆయన 2005-06 మధ్య టీ-టైమ్ పేరిట .. దేశవ్యాప్తంగా తేనీటి వ్యాపారం ప్రారంభించారు. ఇది మంచి ఫామ్ లో ఉంది. ప్రస్తుతం మరిన్ని ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నా రు. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా టీ-టైమ్ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి. దీనిని పసిగట్టిన సైబర్ ముఠా.. టీ-టైమ్ ఫైనాన్స్ మేనేజర్ శ్రీనివాసరావును బుట్టలో వేసుకున్నారు. ఆయన నుంచే సొమ్మును రాబట్టారు.
ఎలా చేశారంటే..
గత నెల 22న మేనేజర్ శ్రీనివాసరావు ఫోన్‌కు.. వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. దీనిలో ``నేను ఉదయ్‌ని (ఎంపీ). నాకు అత్యవసరంగా డబ్బు అవసరమైంది. వెంటనే ఈ నెంబరుకు పంపించు`` అని పేర్కొన్నా రు. వాస్తవానికి ఎంపీ వినియోగించే రెగ్యులర్ ఫోన్ నెంబరు అదికాదు. అయితే.. వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో తంగెళ్ల ఉదయ్‌దే ఉంది. దీంతో మేనేజర్‌కు సందేహం రాలేదు. పైగా.. ``నేను కొత్త ఫోన్ తీసుకున్నా`` అని కూడా మెసేజ్‌లో ఉండడంతో సదరు సందేశం.. తమ యజమాని(టీ-టైమ్ వ్యవస్థాపకుడు కదా) అని భావించారు. దీంతో కోరినంత నగదును చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు.
ఇలా మొత్తం 11 సార్లు.. వివిధ బ్యాంకు ఖాతాలకు 92.5 లక్షల రూపాయలను మేనేజర్ బదిలీ చేశారు. అయితే.. ఈ నెల 8న ఎంపీ ఉదయ్.. తన బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకుంటున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో మేనేజర్‌ను నిలదీశారు. ఆయన జరిగిన విషయం చెప్పడంతో హుటాహుటిన సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సైబర్ ముఠాను పట్టుకునే పనిలో ఉన్నారు. ఓ ఖాతాలోకి చేరిన 7 లక్షల నగదును మాత్రమే ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. మిగిలిన సొమ్ము.. సైబర్ ముఠా చేతికి చేరిపోయిందని చెబుతున్నారు.