2024 ఎన్నిలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం 15 నెలల కాలంలోనే సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు కూటమి పార్టీల నేతలు. ఈ క్రమంలోనే అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా రప్పా అని డైలాగులు కొట్టడం కాదని, అసెంబ్లీకి రావాలని జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రప్పా రప్పా అనే డైలాగులు కొడితే భయపడే ప్రసక్తి లేదని, ఇక్కడ సీబీఎన్, పవన్ ఉన్నారని హెచ్చరించారు.
ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుందని, తనను ముఖ్యమంత్రిని చేసింది కూడా ప్రజలేనని చంద్రబాబు అన్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని జనం క్లాస్ పీకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఈ వేదికపై నుంచి ఆయన తీపి కబురు చెప్పారు. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది దసరా నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆయన అన్నారు. తమది జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం అని, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరతామని తెలిపారు. పథకాలు అమలు చేయలేమంటూ తమ ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని స్త్రీ శక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఈ పథకం అమలయిన తర్వాత ఆటో డ్రైవర్లు తమ ఉపాధిని కొంత వరకు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారికి కూడా ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు వాహన మిత్ర పథకం ద్వారా ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.