సీఎం చంద్రబాబుపై జగన్ నోరు పారేసుకోవడం కొత్త కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిపారేయాలి అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కొద్ది సంవత్సరాల క్రితం చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అధికారం కోల్పోయినా...కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోయినా జగన్ నోటి దురుసు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై జగన్ రోరు పారేసుకున్నారు. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చస్తే బెటర్ అంటూ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారని, కుప్పంలోనూ రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డారని జగన్ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏనాడూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని, పాలన ప్రజల కోసమా దోపిడీ దారుల కోసమా అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు అందాల్సిన విద్, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని జగన్ ప్రశ్నించారు.
ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని, ప్రతిదీ దోచేయాలనే ఆలోచన ఆయనకు ఉందని జగన్ విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలకు, బెల్లానికి అమ్మేస్తున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే చంద్రబాబు వద్దని చెప్పారని, తమ ప్రణాళిక ప్రకారం పనులు జరిగి ఉంటే మరో 6 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవని జగన్ అన్నారు.