వైఎస్ రాజా రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి. ఎప్పుడో 1998లోనే ఆయన చనిపోయారు. ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నాడని స్పష్టమైంది. అతనెవరో కాదు.. రాజారెడ్డి ముని మనవడు, వైఎస్ షర్మిళ-అనిల్ కుమార్ల తనయుడు. విదేశాల్లో చదువుకున్న అతను.. గత ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని వార్తల్లోకి వచ్చాడు.
ఈ మధ్య రాజారెడ్డి తల్లితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా కర్నూలు ఉల్లిగడ్డ మార్కెట్‌ను షర్మిళతో కలిసి సందర్శించాడు రాజారెడ్డి. ఈ సందర్భంగా మీడియా నుంచి షర్మిళకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అని అడిగితే.. ఔననే సమాధానం ఇచ్చింది షర్మిళ. సరైన సమయంలో అతను రాజకీయాల్లోకి అడుగు పెడతాడని ఆమె చెప్పింది.
పెళ్లి తర్వాత రాజా రెడ్డి తల్లితో కలిసే ఉంటున్నాడు. వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే అతను రాజకీయాల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తాజా కార్యక్రమంలో అతను తల్లితో పాటు కాంగ్రెస్ కండువాలు వేసుకునే కనిపించాడు. తద్వారా తాను కూడా ఆ పార్టీలోనే చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి తన అన్నయ్య జగన్‌తో విభేదించి, ముందుగా తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిళ.. అక్కడ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడంతో పార్టీని మూసేశారు.
తర్వాత ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమెను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది అధిష్టానం. ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు తీసుకురాలేకపోయినప్పటికీ.. తన అన్నయ్య పార్టీని డ్యామేజ్ చేయడంలో కీలక పాత్రే పోషించారు. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తనయుడు కూడా పార్టీలోకి రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.