మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై ఇటీవల కేసీఆర్ తనయ కల్వకుంట కవిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయడం.. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే తాజాగా కవిత ఆరోపణలపై తాజాగా హరీష్ రావు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. లండన్ పర్యటన పూర్తిచేసుకుని హరీష్ రావు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవింతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై గతంలో ప్రతిపక్ష పార్టీలు చేసిన అనవసర విమర్శలే.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా చేశారని హరీష్ మండిపడ్డారు. ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో.. ఎవరి లబ్దీ కోసం చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని, దాచేదేమీ లేదని.. స్వచ్ఛతతోనే నడిచానని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ, తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని హరీష్ రావు ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని గుర్తుచేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రైతులు ప్రస్తుతం ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, వరదల ప్రభావం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు. దశాబ్ద కాలం పాటు కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూల్చివేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు.
మా నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యమని హరీష్ నొక్కిచెప్పారు. దీంతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారాయి. కాగా, ఒకవైపు కవిత వ్యాఖ్యలపై సమాధానం ఇస్తూనే, మరోవైపు ప్రభుత్వంపై దాడి చేయడం ఆయన డబుల్ స్ట్రాటజీ గా చెప్పుకోవచ్చు.