అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఒక వింత సంఘటన ఆలయ భక్తులను, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా దొంగలు ఎక్కడ విలువైన వస్తువులు కనబడితే అక్కడే దోచేస్తారు. ఇల్లు, షాపులే కాదు పవిత్రమైన దేవాలయాల్లో కూడా తమ చేతివాటం చూపిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో దేవాలయాల్లో జరిగే చోరీలకు ఒక వింత ట్విస్ట్ ఉంటుంది. అటువంటి ట్విస్ట్ అనంతపురం జిల్లాలోనూ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల రోజుల క్రితం బుక్కరాయసముద్రం చెరువుకట్టపై ఉన్న ముసలమ్మ ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళ ఆలయంలోని హుండీ పగలగొట్టి సొమ్మును ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినా, దొంగలు దొరకలేదు. అయితే గురువారం ఉదయం ఆలయ తలుపులు తెరిచిన పూజారులకు.. గర్భగుడి ఎదురుగా ఓ మూట కనిపించింది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆలయ నిర్వాహకులు మూటను విప్పి చూడగా.. దానిలో రూ.1,86,486 నగదు మరియు ఒక లేఖ ఉన్నట్లు తేలింది. ఆ లేఖలో దొంగలు రాసింది మరింత ఆశ్చర్యపరిచింది. `మేము హుండీ దోచుకున్న తర్వాత మా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. అది అమ్మవారి శాపమని భావించాం. అందుకే దొంగిలించిన సొత్తు మళ్లీ తిరిగి ఇక్కడే వదిలిపెడుతున్నాం` అని లేఖలో దొంగలు పేర్కొన్నారు. ఈ సంఘటనతో భక్తులు, గ్రామస్తులు విస్తుపోయారు. అమ్మవారి మహత్యం వల్లే సొత్తు తిరిగి వచ్చిందని భక్తులు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఆ ఇంట్రెస్ట్రింగ్ చోరీ వైరల్‌గా మారింది.