గీతం విద్యా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు బాలయ్య చిన్నల్లుడి కుటుంబం నిర్వహించే గీతం క్యాంపస్ లో తాజాగా నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో ఒక విద్యార్థిని భారీ ప్యాకేజీతో జాబ్ సొంతం చేసుకుంది. గీతం విద్యా సంస్థల్లో భాగంగా విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో వారి సంస్థలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో సీఎస్ఈ విద్యార్థిని ప్రియాంక రెడ్డి భారీ ప్యాకేజ్ ను సొంతం చేసుకుంది.
అమెజాన్ సంస్థలో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారు. రూ.1.4 కోట్ల భారీ ప్యాకేజీతో ఆమె ఎంపికయ్యారు. తల్లిదండ్రులతో కలిసి కూకట్ పల్లిలో ఉంటున్నారు. వారి సొంతూరు గుంటూరు జిల్లా మల్లాయపాలేనికి చెందిన వారు. తాజాగా క్యాంపస్ సెలక్షన్ లో కొలువులు సాధించిన వారికి నియామక పత్రాల్ని అందించారు.
ప్రియాంకరెడ్డి విషయానికి వస్తే ఆమెను యూకేలోని అమెజాన్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇంజినీర్ 1 పొజిషన్ కు ఎంపికైనట్లుగా గీతం ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కొలువుల సాధన క్లిష్టంగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. పట్టుదలతో పాటు.. స్కిల్స్ .. సబ్జెక్టు మీద పట్టు ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా భారీ ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగుల్ని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పాలి. ఏమైనా కారుమూరి ప్రియాంకరెడ్డికి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఆల్ ద బెస్టు.