అమరావతి రీస్టార్ట్ పనులను ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని పనులపై 'అమరావతి క్యాపిటల్ కమిటీ'ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2015లో అమరావతి రాజధానికి మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంకల్పించారు. అయితే, షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తనను పట్టుకున్న మహిళా పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తీయ్..నా మీద చేయి వేసే అధికారం మీకు లేదంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతున్నానని, అది కూడా నేరమా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.