సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం దర్శించేందుకు వచ్చిన ఏడుగురు భక్తులు గోడ కూలి మరణించారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.3 లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు. ఈ ఘటనపై ముగ్గురు ఉన్నతాధికారులతో ఓ విచారణ కమిటీని కూడా వేశామని తెలిపారు.
ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన పవన్...మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ దుర్ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యానని మంత్రి లోకేశ్ అన్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. శిథిలాల తొలగింపు కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.