పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్ పై భారత్ దౌత్యపరమైన ఒత్తిళ్లు పెడుతోన్న సంగతి తెలిసిందే. నదీ జలాల ఒప్పందానికి బ్రేక్ వేయడంతో పాటు వీసాలు నిలిపివేయడం వంటి పలు చర్యలు చేపట్టడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే పాక్ కు మరో షాకిచ్చేందుకు ప్రధాని మోదీ రెడీ అయ్యారని తెలుస్తోంది. పాక్ తో 2021 ఫిబ్రవరి 24న చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్ లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను అమానుషంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాక్ తో సీజ్ ఫైర్ కు మోదీ నో అంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ పాక్ తో సీజ్ ఫైర్ ఒప్పదం విరమించుకుంటే సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచి సైన్యానికి అదనపు బలగాలను ఇవ్వాలని మోదీ భావిస్తున్నారట.
ఎప్పుడూ హిందీలో ప్రసంగించే మోదీ...తొలిసారిగా ఇంగ్లిషులో టెర్రరిస్టులకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే....ఉగ్రవాదులను వేటాడి శిక్షించి తీరతామని మోదీ హెచ్చరించారు. హిందీలో హెచ్చరించిన మోదీ హఠాత్తుగా ఇంగ్లీషులో మాట్లాడి వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ మీడియాకు సైతం తన ప్రసంగం అర్థం కావాలని మోదీ ఇలా చేశారు.
"India will identify every terrorist, trace them and punish them... We will hunt them down to the ends of the Earth" అని మోదీ ఇంగ్లిషులో చేసిన హెచ్చరిక వైరల్ గా మారింది.