ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసిన మాదిరిగానే ఏపీ లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి మొదలు పలువురు అరెస్టయ్యారు. అయితే, ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారి జగన్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై ఏపీ వైద్య శాఖా మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు సూత్రధారి జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ఆ అరెస్టు నుంచి తప్పించుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో నాసిరకం మద్యం తాగిన వారు అనారోగ్యానికి గురికావడం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నోట్ల కట్టల వీడియోలో వైరల్ అవుతున్న వ్యక్తి జగన్ అనుచరుడు కాదా? అని నిలదీశారు.
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఓర్వలేక జగన్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని ఆరోపించారు. ఆ క్రమంలోనే అభూతకల్పన చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని, సభకు వచ్చి ప్రజా సమస్యలపై జగన్ చర్చించగలరా? అని ప్రశ్నించారు.