రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం ఈజీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ చేసింది అదేనని చెప్పారు. 2019లోనూ టీడీపీగెలిచి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టి ఉండేవన్నారు. తద్వారా ఇప్పటికేరాష్ట్రం దేశం లోనే ప్రథమ స్థానంలో ఉండేదన్నారు. కానీ, ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన ఒక సైకో.. రాష్ట్రాన్ని అన్ని విధాలా.. నాశనం చేశారని, వ్యవస్థలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టాలని.. అప్పుడే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చంద్రబాబు చెప్పారు. తాజాగా ఆయన కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన సూపర్6 హామీలనుపూర్తిగా అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే తల్లికి వందనం హామీని నిలబెట్టుకున్నామన్న ఆయన.. ఒక తల్లికి ఏడుగురు పిల్లలున్నా రూ.13000 చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కడప జిల్లాకు నీళ్లు తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో తాను కట్టిన పట్టిసీమ ద్వారా పులివెందులకు కూడా నీరిచ్చామని.. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర పురోగతి విషయంలో రాజీ లేని ధోరణితో ముందుకు సాగుతున్నామన్నారు.
అరాచకాలు సహిస్తారా?
వైసీపీ అరాచకాలకు కేరాఫ్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. అలాంటి పార్టీని సహిస్తారా? అని ప్రశ్నించారు. తమ్ముడు తనవా డైనా తప్పు చేస్తే దండించాలి.కానీ, వైసీపీ నేతలు మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్నా.. జగన్‌కు పట్టడం లేదన్నారు.పైగా వారిని సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఒక్కసారి అంటూ వచ్చి వ్యవస్థలను నాశనం చేసి.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు తాను ఎంతో కష్టపడి పెట్టుబడులు తీసుకవస్తున్నానని చెప్పారు. ``ఒక వ్యవస్థను ధ్వంసం చేయడం, నాశనం చేయడం ఈజీ. గత ఐదేళ్లలో వైసీపీ అదే చేసింది. దీనిని నిలబెట్టేందుకు ఇప్పుడు చాలా కష్టపడాల్సి వస్తోంది`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గండికోట పూర్తి చేస్తాం
సీమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించే గండికోట ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికిగాను 85 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. ఇక్కడే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ``అమెరికాకు గ్రాండ్ క్యానియన్‌లా మనకు గండికోట ఉంది. దాన్ని ఆకర్షణీయ ప్రాంతంగా తయారు చేస్తాం.`` అని తెలిపారు. హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టామని.. ఇక్కడి రైతులకు ఇకపై అంతా మంచే జరుగుతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ కూటమి నేతలను గెలిపించాలని పిలుపునిచ్చారు.