71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన `ది కేరళ స్టోరీ` చిత్రం సత్తా చాటింది. రెండు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ ను అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ ఎంపిక కాగా.. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ది కేరళ స్టోరీ సినిమాకుగాను పసంతను మొహపాత్రో పురస్కారం సొంతం చేసుకున్నారు.
రెండు నేషనల్ అవార్డ్స్ రావడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేయగా.. కేరళ సీఎం పినరయి విజయన్ మాత్రం తీవ్ర ఆగ్రహం వెల్లగక్కారు. `కేరళ ప్రతిష్టను దెబ్బతీసే మరియు మత విద్వేషానికి బీజాలు వేసే స్పష్టమైన ఉద్దేశ్యంతో స్పష్టమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక చిత్రానికి గౌరవం ఇవ్వడం ద్వారా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ, సంఘ్ పరివార్ యొక్క విభజన భావజాలంలో పాతుకుపోయిన కథనానికి చట్టబద్ధతను కల్పించింది.
మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ సామరస్యం మరియు ప్రతిఘటనకు నిలయంగా నిలిచిన కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించింది. కేవలం మలయాళీలే కాదు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ సత్యాన్ని మరియు మనం ఎంతో ఆదరించే రాజ్యాంగ విలువలను సమర్థించుకోవడానికి తమ స్వరాన్ని వినిపించాలి.` అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. కాగా, సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ది కేరళ స్టోరీ మూవీ 2023లో విడుదలై సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగానూ పెను ప్రకంపనలు సృష్టించింది. ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువు అయింది. ఫైనల్ గా మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.