మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. తనదైన ప్రతిభా, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగారు. దేశం మెచ్చిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. అయిన కూడా చిరంజీవి ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు అంటే నమ్ముతారా? కానీ అది నిజం. పైగా రెండు చోట్ల ఆయనకు పెన్షన్ అందుతుంది.
గతంలో కొన్నాళ్లు చిరంజీవి పాలిటిక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. కానీ, రాష్ట్రంలో ఆ పార్టీకి మూడవ స్థానం మాత్రమే దక్కింది. 2011లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన చిరంజీవి.. 2012లో కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గించుకున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు పరాజయం ఎదురైంది. ఆ తర్వాత పాలిటిక్స్ కు దూరమై పూర్తిగా సినిమాలపై దృష్టి సారించారు. అయితే మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పెన్షన్ అందిస్తుంటాయి. తాజాగా ఓ సంస్థ మాజీ ప్రజాప్రతినిధుల కోటలో ఏపీ నుంచి పెన్షన్ అందుకుంటున్న వారి జాబితాను సేకరించింది.
ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, నాదెండ్ల భాస్కర్ రావు వంటి ప్రముఖులు కూడా ఉండడం అందరిని విస్మయానికి గురిచేసింది. వీరంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి కూడా పెన్షన్ అందుకుంటున్నారు. పింఛన్లు తీసుకోవడం తప్పుకాదు.. నేరం కూడా కాదు.. కానీ, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా ఇలా రెండు చోట్ల నుంచి పింఛన్లు తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక పెన్షన్ తీసుకుంటే ఉత్తమం అని కొందరు హితవు పలుకుతున్నారు.