మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చలకు దారితీసింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు మొబైల్ లో రమ్మీ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే. ఇందుకు సంబంధించిన వీడియోను తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వివాదం చెలరేగింది. రాష్ట్రంలోని రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతూ, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రి కోకాటే అవేం పట్టనట్లు అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున విమర్శించారు.
రైతుల సమస్యలపై చర్చించాల్సిన సమయంలో మంత్రి కోకాటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రి కోకాటే తక్షణం రాజీనామా చేయాలని.. పాలక ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాల నడుమ మాణిక్‌రావ్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోగా.. విడ్డూరంగా ఆయన్ను వ్యవసాయశాఖ నుంచి తప్పించి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలను గురువారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మాణిక్‌రావ్ కోకాటే స్థానంలో వ్యవసాయ శాఖను ఎన్సీపీకు చెందిన మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు. గతంలో దత్తాత్రేయ పర్యవేక్షించిన క్రీడలు, యువజన సంక్షేమ శాఖను కోకాటేకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా పెను దూరం రేపుతోంది. కోకాటే విషయంలో ప్రభుత్వం తీరు పట్ల శివసేన (యూబీటీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.