``మూడేళ్లు కళ్లు మూసుకుంటే మాదే ప్రభుత్వం. అప్పుడు మేమంటే ఏంటో ఆ పెద్దమనిషికి(చంద్రబాబు) చూపిస్తాం. ఇప్పుడు ఆయన విత్తనం అప్పటికి చెట్టవుతుంది. అప్పుడు అరిచి గగ్గోలు పెట్టినా.. సప్తసము ద్రాలు దాటి వెళ్లినా.. వెనక్కి రప్పిస్తాం. చట్టంముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం.`` అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు.
అనంతరం.. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కోవూరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కొన్ని రోజుల కిందట.. నల్లపరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయంతెలిసిందే. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి పై దాడి చేశారు. ప్రస్తుతం దీనిపై కేసులు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తమ వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 14 కేసులు నమోదు చేశారని.. ఒక్కదానిలో కూడా.. పసలేదన్నారు. వైసీపీ హయాం లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. తామే కేసు పెట్టామని.. ఇప్పుడు ఆ కేసు లో గోవర్ధన్‌రెడ్డిని ఇరికించారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేశారని మరికొన్ని కేసులు నమోదు చేశారన్నారు. ఇవన్నీ నిలబడే కేసులు కావని తెలిసినా.. మాజీ మంత్రి అనికూడా చూడకుండా.. కాకాణిని జైల్లో పెట్టారని అన్నారు. అదేవిధంగా పేర్ని నాని, వంశీలపైనా కేసులు పెట్టి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.
వందల కొద్దీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించి, కొట్టారని జగన్ విమర్శించారు. ఇంతకు ఇంత రెట్టింపుతో తాము బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. దీనిని ఏదీ వదిలి పెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటున్నామన్నారు. నల్లపరెడ్డిని ఈ సందర్భంగా ప్రశాంత స్వబావిగా జగన్ కీర్తించారు. ఆయన కుటుంబం అందరికీ మేలు చేస్తోందని.. అలాంటి నల్లపరెడ్డిపైనా కేసు పెట్టారన్నారు. ``మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక.. లేమా? అనేది ఆ పెద్ద మనిషి చెప్పాలి.`` అని జగన్ వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారులకు వార్నింగ్..
ఈ సందర్భంగా జగన్ పోలీసు అధికారులకువార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పినట్టు కాదు.. చట్టం చెప్పినట్టు పనిచేయాలని వారికి సూచించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. వైసీపీకార్యకర్తలను, నాయకు లను కూడా వేధిస్తున్న వారిని.. ఎక్కడున్నా వదిలేది లేదన్నారు. వీఆర్ ఎస్ తీసుకున్నా.. రిటైరైనా.. రాష్ట్రం వదిలి పారిపోయినా.. వదిలిపెట్టుకుండా వెంటాడతామన్నారు. చట్టం ముందు అందరినీ నిలబెడతామని తేల్చి చెప్పారు. కాగా.. జగన్ పర్యటనలో కీలక నాయకులు మిస్సయ్యారు.