ఆవేశం అనర్ధం.. ఆలోచన అర్ధవంతం. ఈ చిన్న విషయాన్ని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. మరిచిపోయారో.. లేక అసలు తెలియదో కానీ.. ఆయన చేసిన ప్రకటనలు.. క్షేత్రస్థాయిలో నాయకులపై చూపించిన చిరాకు వంటివి పార్టీలో చిచ్చు రేపాయి. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నాగబాబు.. పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్పొరేటర్లతోనూ భేటీ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా పెద్దాయన వచ్చాడు కదా! అని ద్వితీయ శ్రేణి నాయకులు.. తమ సమస్యలు చెప్పుకొచ్చారు.
ఇది అన్ని పార్టీల్లోనూ సహజంగా ఉండే ధోరణే. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఎంతగావిసిగిపోతే.. ఈతరహాలో నాయకులకు తమ సమస్యలు చెప్పుకొనే ప్రయ త్నం చేస్తారు? .. ఈ సమయంలో పెద్ద నాయకులుగా ఉన్నవారు వారిని సర్దు బాటు చేయాలి. వారి ఆవేద నను తగ్గించే ప్రయత్నం కూడా చేయాలి. కానీ.. నాగబాబుకు మాత్రం ఇవి పెద్ద తప్పులుగా కనిపించాయి. ``ఎవరూ నోరెత్తడానికి వీల్లేదు!`` అని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. కూటమితో కలిసి ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. అయితే.. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. నాగబాబుకు ఒక్కటే పార్టీ. కానీ, జనసేనలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ పార్టీలు చాలానే ఉన్నాయి. ఇది కాదంటే మరొకటి!. ఇలా కనుక వారు ఆలోచన చేస్తే(చేస్తున్నారు కూడా)... అప్పుడు మొదటికే మోసం కాదా?!. పైకి చెప్పుకొంటున్నట్టుగా.. జనసేనకు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. కేవలం పవన్ ఇమేజ్ ఒక్కటే పార్టీకి వెన్నెముకగా ఉంది.
బూత్ స్థాయి నాయకుల నుంచి మండలస్థాయి వరకు.. జనసేన ఖాళీ. ఇలాంటి సమయంలో నాయకు లు, కార్యకర్తల సింపతీని పెంచుకునేందుకు.. వారిలో భరోసా నింపేందుకు నాగబాబు వంటి కీలక నాయకులు ప్రయత్నించాల్సి ఉంది. అలా కాకుండా.. చిరాకు పడి, క్షేత్రస్థాయిలో అవమానాలైనా భరించాలి.. తిట్లయినా తట్టుకోవాలి.. అంటే.. రోజులు అలా లేవు. రాజకీయాలు అసలే లేవు. సో.. ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో మంటలు రేపుతున్నాయి. ఇవి పెరిగి భోగి మంటలు అయితే.. నాగబాబు కు నష్టం కాకపోవచ్చు.. కానీ.. పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది.