రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నోరు జారారు. ఆయనకు ముందు పెద్దల సభలో మాట్లాడిన.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆపరేషన్ సిందూర్ ఎందుకు నిలిపివేశారని.. కేంద్రంపై ఎవరి ఒత్తిడి పనిచేసిందని ప్రశ్నించారు. మన దేశంతో సంబంధం లేని ఓ దేశం(అమెరికా పేరు చెప్ప కుండా) హెచ్చరించడంతో ఆపరేషన్ సిందూర్ నిలిపివేశారని విమర్శించారు. ప్రధాని మోడీకి బొత్తిగా బాధ్యతలేదన్న ఖర్గే.. దేశ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్ అల్లర్లను కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే.. ఆ తర్వాత.. మైకు అందుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఖర్గేను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఆయనకు మైండ్ పోయింది. మైండ్ పనిచేయడం లేదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా ఏవేవో మాట్లాడు తున్నారు.`` అని నిప్పులు చెరిగారు. దీంతో సభలో ఒక్కసారిగా ప్రతిపక్షాలు బల్లలు చరుస్తూ.. నిరసన వ్యక్తం చేశాయి. నడ్డా క్షమాపణలు చెప్పాలని.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు కూడా ఏకమ య్యారు. దీంతో సుమారు 12 నిమిషాలకు పైగానే రాజ్యసభ దద్దరిల్లింది. అనంతరం.. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్.. సభను శాంతింపచేసే ప్రయత్నాలు చేశారు.
కానీ, ప్రతిపక్షాలు మాత్రం నడ్డా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో నడ్డా మరోసారి జోక్యం చేసుకుని.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని.. క్షమాపణలు(మాఫ్ కీజియే ఖర్గే జీ) చెబుతున్నానని అన్నారు. దీంతో సభ మళ్లీ యధాతథ స్థితికి వచ్చింది. ఇక, నడ్డాను తాను ఎప్పుడూ సోదరుడిగా భావిస్తానని.. మంచిగా పనిచేసే మంత్రుల్లో ఆయన కూడా ఉన్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. దీంతో నడ్డా మరోసారి లేచి.. ఖర్గేకు అభినందనలు తెలిపారు. అయితే.. ప్రధాని మోడీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఆయన పరిధికి మించి వ్యాఖ్యలు చేశారని.. వాటిని వెనక్కి తీసుకోవాలని నడ్డా కోరారు. అంతేకాదు రాజ్యసభ రికార్డుల నుంచికూడా వాటిని తొలగించాలన్నారు.