ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ సోషల్ మీడియా భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇది పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు చేశారో.. లేకపోతే వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం మేరకు చేశారో తెలియదు కానీ హరిహర వీరమల్లు సినిమాపై మాత్రం నెగిటివ్ యాంగిల్ లో ప్రచారం దంచి కొట్టారు. దీనివల్ల ఆ సినిమా నష్టపోయిందా కలెక్షన్స్ తగ్గిపోయాయా.. అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ పై మరోసారి కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఈ విషయాన్ని ఎవరో చెప్పడం లేదు మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకుడు కురసాల కన్నబాబు వంటి వారు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులే జగన్‌కు సమాచారం చేరవేశారు. ``మనం చేస్తున్న ప్రచారం వల్ల పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంద``ని వారు తేల్చి చెప్పారు. ఇది వాస్తవం. గత ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వల్ల యువత ఓటు బ్యాంకు చాలా వరకు చిన్నాభిన్నమైపోయింది. పార్టీకి కచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాల్లో కూడా పరాజయం ఎదురైంది.
అదేవిధంగా కాపు సామాజిక వర్గం పూర్తిగా పవనకు అనుకూలంగా మారిపోయింది. ఆ ప్రభావంతోనే ఏడాదికాలంగా పవన్ పై విమర్శలు చేయడం తగ్గించారు. ఒకప్పుడు నిరంతరం పవన్ పై విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులు.. ఈ ఏడాది కాలంలో విమర్శలు చేయలేదనే చెప్పాలి. అదేవిధంగా జగన్ కూడా ఈ ఏడాది కాలంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, కుటుంబాల గురించి ప్రస్తావించలేదు. పైగా స్విజర్లాండ్ లో మార్క్ శంకర్ పాఠశాలలో ప్రమాదం సంభవించినప్పుడు జగన్ సోషల్ మీడియాలో సానుకూలంగా పోస్ట్ పెట్టారు.
ఈ పరిణామాలతో కొంత సర్దుబాటు జరిగింది. కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత తగ్గుతున్న నేపథ్యంలో అనూహ్యంగా హరిహర వీరమల్లు సినిమాపై చేసిన నెగిటివ్ ప్రచారం మరోసారి కాపులను కుదిపేసింది. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమని ఈ వ్యతిరేక ప్రచారాలు మంచిది కాదని పార్టీలోనే సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా చెప్పుకొచ్చారు. దీంతో తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై ఎలాంటి నెగటివ్ ప్రచారం మనకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఇకపై ఎటువంటివి జరగడానికి వీలు లేదని పార్టీ సీనియర్ నేత మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే జరిగిన నష్టం చాలని సినిమా మంచి చెడుల గురించి ప్రేక్షకులు చూసుకుంటారని రాజకీయం గా దీన్ని ఎక్కువ చేసి చేతులు కాల్చుకునే దాకా తీసుకురావద్దనే ఆయన తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయి. వీరమల్లును అనవసరంగా కెలికారని, దీనివల్ల వారికి వచ్చే లాభం ఏమీ లేదని కూడా కూటమి పార్టీలోనూ చర్చ నడిచింది. మొత్తానికి తాజాగా తీసుకుని నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.