ఆంధ్రప్రదేశ్‌లో 2019-24 మధ్య ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటిగా లిక్కర్ స్కామ్‌ను పేర్కొంటోంది కూటమి ప్రభుత్వం. అంతకుముందున్న మద్యం విధానాన్ని మార్చి.. ఫేమస్ బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి.. తమకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. సొంతంగా ఏవేవో బ్రాండ్లు పెట్టించి, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. వేల కోట్లు దోచేశారన్నది అప్పటి ప్రభుత్వ పెద్దల మీద ఉన్న తీవ్ర అభియోగం. ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఉన్న రాజ్ కెసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఇంకా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే అనేక సంచలన విషయాలు వస్తున్నాయి. తాజాగా ఈ కుంభకోణంలో సంపాదించిన దాంట్లో రూ.11 కోట్లను హైదరాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు రికవర్ చేయడం సంచలనం రేపుతోంది. విచారణలో భాగంగా ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు రైడ్ చేసి ఈ డబ్బులను పట్టుకున్నారు.
శంషాబాద్ మండలంలోని కాచారంలో సులోచన అనే ఫాం హౌస్‌లో 12 అట్ట పెట్టెల్లో దాచి పెట్టిన రూ.11 కోట్ల మొత్తాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేశారు. ఇదే ఫాం హౌస్‌లో పెద్ద మొత్తంలో మద్యం కూడా దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్‌లో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ డబ్బులను అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డినే ఈ డబ్బులను ఇక్కడ దాచిపెట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ అంటూ ఏమీ జరగలేదని.. తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తుండగా.. ఈ స్కామ్‌కు సంబంధించి ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బయటపడడం వారికి గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ కేసులో మున్ముందు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.