ఏపీలో ఇళ్లకు మరియు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రజా సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. వాడినా వాడకపోయినా స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లుల అధికంగా వస్తాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామాల నడుమ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది.
ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించమని ప్రభుత్వం తరఫున తాజాగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని.. వ్యవసాయ రంగానికి వీటిని బిగించే ఆలోచన లేదని వెల్లడించారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. విశాఖపట్నంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని అధికారులకు ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రజా ఆమోదం లేకుండా ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదని అన్నారు.
సోషల్ మీడియాలో స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. స్మార్ట్ మీటర్ల వినియోగం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు వివరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అందులో భాగంగానే విద్యుత్ శాఖ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లకు మొదట స్మార్ట్ మీటర్లను బిగించి వారిని రోల్ మోడల్ గా చూపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో పేర్కొన్నారు.