విమర్శలు చాలానే ఉండొచ్చు. కానీ.. అభిమానం అంతకు మించి అన్నట్లు ఉండే రాజకీయ అధినేతగా ఏపీ సీఎం చంద్రబాబు సొంతమని చెప్పాలి. దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు ప్రజాజీవితంలో ఉండటం.. ముఖ్యమంత్రిగా పలుమార్లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఐటీలో తెలుగు వారి సత్తా చాటేందుకు అవసరమైన నేపథ్యాన్ని అందించిన ప్రజానేతగా చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు విదేశాల్లో తమ సత్తా చాటుతున్నారంటే.. దానికి కారణం ఆయన విజన్ గా ఫీలయ్యే వారు బోలెడంతమంది.
తామీ రోజు ఉన్నత స్థానాల్లో ఉండేందుకు చంద్రబాబు దార్శనికత తాము సాయం చేసిందన్న అభిమానాన్ని.. తమకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రదర్శిస్తుంటారు ప్రవాస తెలుగువారు. తాజాగా అలాంటి సీనే మరోసారి రిపీట్ అయ్యింది చంద్రబాబు సింగపూర్ ట్రిప్ లో. ప్రవాసాంధ్రులతో భేటీ అయిన సందర్భంగా ఒక మహిళ తాను రోల్స్ రాయిస్ సంస్థలో సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు చెప్పటమే కాదు.. తాను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటానికే చంద్రబామే కారణమంటూ సభావేదికగా చెప్పిన వైనం బాబు ఇమేజ్ ను మరింత పెంచేలా మారిందని చెప్పాలి.
సదరు మహిళ మాటకు స్పందించిన చంద్రబాబు..రోల్స్ రాయిస్ లో ఏ ప్రాజెక్టులో పని చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఏఐలో క్లౌడ్ టీమ్ ను లీడ్ చేస్తున్నట్లుగా చెబుతూ.. ‘‘ఆగస్టు నాలుగున కంపెనీ హెడ్డాఫీసు నుంచి ప్రతినిధి రానున్నారు. రోల్స్ రాయిస్ సంస్థ ఏపీకి రావాలి. స్థానిక యువతకు ఉపాధి కాల్పించాలని కోరుకుంటున్నా. అందుకు నా వంతు సహకారాన్ని అందిస్తా’’ అని చెప్పిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబుకు ఆనందానికి గురయ్యేలా చేశాయని చెప్పాలి.
ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశం మరోసారి ఆయన ఇమేజ్ ను భారీగా పెంచేలా మారింది. ఇందులో మాట్లాడిన పలువురు.. ఆయన విజన్ కారణంగానే తామీ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నట్లుగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు విన్నపాలు చేసుకున్నారు. వీటిల్లో చాలావరకు ఆయన నేరుగా చేయగలిగేవి లేవనే చెప్పాలి. అందులో ఒకట్రెండు చూస్తే.. సింగపూర్ స్థానిక స్కూళ్లల్లో తెలుగును పాఠ్యాంశంగా చేర్చాలని ఒకరు కోరితే.. మరొకరు సింగపూర్ లో స్థిరపడ్డ తెలుగువారి పిల్లలకు డిగ్రీలో సీట్లు రావట్లేదని.. ఎందుకంటే వారు సింగపూర్ శాశ్విత పౌరులు కాకపోవటమే. దీనిపై ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు మాట్లాడాలని.. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. నిజానికి ఇలాంటి అంశాల్లో చంద్రబాబు చేయగలిగింది తక్కువే. కానీ.. తాను ప్రయత్నిస్తానని చెబుతూ చంద్రబాబు వారికి ఊరట కల్పించేలా చేశారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు సింగపూర్ పర్యటన మరోసారి ఆయన ఇమేజ్ ను భారీగా పెంచేందుకు సాయం చేసిందని మాత్రం చెప్పక తప్పదు.