ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల టైమ్ లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒకటి. మహిళలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ స్కీమ్ అమల్లోకి రాబోతుంది. ఆగస్టు 15 ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే కొద్ది రోజుల క్రితం ఉచిత బస్సు జిల్లాకే పరిమితమని సీఎం చంద్రబాబు ప్రకటించడం కలకలం రేపింది. ఈ అంశాన్ని విపక్ష వైసీపీ ఆయుధంగా తీసుకుని కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.
అయితే తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ఫ్రీ బస్ స్కీమ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ పథకానికి వర్తించే రూల్స్ వెల్లడించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో నిర్వహించిన `సుపరిపాలనలో తొలి అడుగు` కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆగస్టు15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామని.. కూటమి హామీల్లో భాగంగా మహిళలు రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చని ప్రకటించారు.
ఇటీవల ఆర్టీసీ అధికారులతో ఈ స్కీమ్ పై మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు సమావేశం అయ్యారట. అయితే పథకాన్ని జిల్లాకు పరిమితం చేద్దామని అధికారులు సలహా ఇవ్వగా.. లోకేష్ అందుకు అంగీకరించలేదని, ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాలని ఆయన అన్నారని తాజాగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఎక్కడకు వెళ్లిన ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని.. ఆటో డ్రైవర్లు నష్టపోకుండా అదే రోజు వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.