రెండు సమోసాలు తిని ఓ క్లాసిక్ లవ్ స్టోరీని కథ వినకుండానే రిజెక్ట్ చేశాడట విజయ్ దేవరకొండ. కొంచెం ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా.. సత్యదేవ్ కీలకపాత్రను పోషించాడు. గ్యాంగ్ స్టార్ బ్యాక్‌డ్రాప్ లో ఇద్దరు బ్రదర్స్ చుట్టూ జరిగే సంఘర్షణ నేపథ్యంలో కింగ్‌డమ్ మూవీ సాగుతుంది. జూలై 31న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, విజయ్ కాంబోలో కింగ్‌డమ్ కన్నా ముందే ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ మిస్ అయింది. గౌతమ్ డెబ్యూ ఫిల్మ్ `మళ్లీ రావా`. 2017లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీలో సుమంత్ హీరోగా నటించాడు. నిజానికి ఈ చిత్రాన్ని గౌతమ్ విజయ్ దేవరకొండతో చేయాలని భావించాడు. `పెళ్లిచూపులు` విడుదలైన రోజే విజయ్ ను కలిసి మళ్లీ రావా స్టోరీ నెరేషన్ ఇచ్చాడట గౌతమ్. పెళ్లిచూపులు మూవీకి హిట్ టాక్ రావడంతో విజయ్‌కు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆయన సరిగ్గా కథ వినడం లేదని గౌతమ్ కి కూడా అర్థమైంది.
అదే సమయంలో ఆఫీస్ బాయ్ సమోసా తేగా విజయ్ తినేశాడు. ఒకటి తిన్నాక గౌతమ్ వైపు చూసి విజయ్ ఏదో అడగబోయాడట. కథలో డౌట్స్ ఉంటే అడుగుతాడేమో అని అనుకున్నాడు గౌతమ్. కానీ విజయ్ ఇంకో సమోసా ఉందా అని అడిగాడంట. వెంటనే ఆఫీస్ బాయ్ మరో సమోసా తేవడం.. అది కూడా తినడం అయిపోయింది. రెండు సమోసాలు తిన్నాక విజయ్ ఏమన్నాడో తెలుసా.. `సారీ బాస్ నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను కొంచెం బయటకు వెళ్లాలి` అని చెప్పి వెళ్ళిపోయాడట.
అలా విజయ్ సరిగ్గా వినకుండానే రిజెక్ట్ చేసిన `మళ్లీ రావా` స్టోరీని గౌతమ్ తిన్ననూరి సుమంత్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయనకు కథ నచ్చి సినిమా చేశాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత `జెర్సీ`తో తన సత్తా ఏంటో రెండోసారి నిరూపించుకున్న గౌతమ్‌కు ఈసారి విజయ్ స్వయంగా ఫోన్ చేసి సినిమా చేద్దామని అన్నాడట. అలా `కింగ్‌డమ్` తెరకెక్కిందని తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ చెప్పుకొచ్చాడు.