ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది `కోర్ట్`. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రంతో రామ్ జగదీష్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రలను పోషించగా.. శివాజీ, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్చి 14న విడుదలైన కోర్ట్ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.
టాక్ పాజిటివ్ గా రావడంతో కోర్ట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తే.. మొదటి రోజే రూ. 8 కోట్లు వసూల్ చేసింది. ఫుల్ రన్ లో రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఓటీటీలోనూ ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు కోర్ట్ కోలీవుడ్‌కు వెళ్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కోర్ట్ తమిళ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కతిరేసన్, వెటరన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ త్యాగరాజన్ సొంతం చేసుకున్నారట. త్వరలోనే కోలీవుడ్ లో త్యాగరాజన్ దర్శకత్వంలో కోర్ట్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాతో కతిరేసన్ కొడుకు కృత్తిక్, సీనియర్ నటి దేవయాని కూతురు ఇనియా తెరంగేట్రం చేయనున్నారు. వీరు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే సినిమాలో అత్యంత ముఖ్యమైన ప్రియదర్శి క్యారెక్టర్ ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.