మంత్రి వ‌ర్గం కూర్పు: ఇద్ద‌రు శ్రీనివాసులు సిద్ధం..!

admin
Published by Admin — July 25, 2025 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో మంత్రి వ‌ర్గం కూర్పుపై సీఎం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఆయ‌న ఓ జాబితాను రెడీ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో కొంద‌రిపై చంద్ర‌బాబు బాహాటంగానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ కూలంక‌షంగా ఆయ‌న చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలో సుమారు 8 మంది మార్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. ఇంత మందిని మార్చితే.. వ్య‌తిరేక సంకేతాలు వ‌స్తాయి కాబ‌ట్టి.. బాగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు నుంచి ముగ్గురి వ‌ర‌కు ప‌రిమితం అయ్యే అవ‌కాశ‌మే ఉంద‌ని తెలుస్తోంది.


ఇదిలావుంటే.. మంత్రులుగా ప్ర‌మోట్ అయ్యేందుకు కొంద‌రు నాయ‌కులు రెడీ అవుతున్నారు. వీరిలో ప్ర ముఖంగా ఇద్ద‌రు శ్రీనివాసులు త‌మ‌కు ప్రమోష‌న్ ఖాయ‌మ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇద్ద‌రూ కూడా మంత్రి వ‌ర్గం జాబితాలో ముందున్నారు. వీరు గ‌త 2014-19 మ‌ధ్య కూడా మంత్రులుగా ఉన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.


పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంతోపాటు.. ప్ర‌త్య‌ర్థుల‌పై కూడా వారిద్ద‌రూ.. ప‌దునైన అస్త్రాల‌తో విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. వారి వారి శాఖ‌ల్లోనూ ప‌నితీరు బాగానే ఉంది. అయితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. యువ‌త‌ను ప్రోత్స‌హించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్ర‌బాబు వారిని ప‌క్క‌న పెట్టారు. కానీ, కొత్త నేత‌లు అనుకున్న విధంగా మైలేజీ సాధించ‌లేక పోతున్నా రు. ప్ర‌భుత్వ ప‌నితీరుకు ఇది ఇబ్బందిగా కూడా మారింది. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసిన సీఎం చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించారు.


సాధ్య‌మైనంత వేగంగా మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఎవ‌రిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌న్న‌ది మాత్రం.. గోప్యంగానే ఉంది. ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు తీవ్రంగా జ‌రుగుతోంద‌ని.. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత‌.. మార్పుల దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి శ్రీనివాసుల పేర్లు పార్టీ వ‌ర్గాల‌లో జోరుగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. చాలా మంది నాయ‌కులు మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నా.. అనుభ‌వం ప్రాతిప‌దిక‌నే నాయ‌కుల‌ను ఎంపిక చేసుకోవాల‌ని చంద్ర‌బాబునిర్ణ‌యంతో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags
Ganta Srinivasa Rao Kalava Srinivasulu ap cabinet TDP Cm Chandrababu Ap Politics
Recent Comments
Leave a Comment

Related News