కోవిడ్ టైమ్ లో థియేటర్స్ మూతపడడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్, హారర్, క్రైమ్.. ఇలా అన్ని రకాల కంటెంట్ అన్ని భాషల్లోనూ లభిస్తుండడంతో ప్రజలు ఓటీటీలకు ఫుల్ ఎడిక్ట్ అయ్యారు. అయితే తాజాగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను కేంద్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. అశ్లీల మరియు లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను అరికట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉల్లు, డెసిఫ్లిక్స్, బిగ్ షాట్స్ తో సహా 25 ప్రముఖ ఓటీటీ యాప్స్, వెబ్‌సైట్‌లను నిషేధించింది.
యువతను, సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ ప్లాట్‌ఫారమ్‌లు సాఫ్ట్ పోర్న్ కంటెంట్‌ను అందిస్తున్నాయని.. ఇది భారతీయ సంస్కృతి, నైతికతకు విరుద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత భౌగోళిక ప్రాంతంలో ఈ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లను తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిషేధించబడిన జాబితాలో.. ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, హిట్‌ప్రైమ్, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్ఎక్స్ వీఐపీ, ఫుగి, ట్రిఫ్లిక్స్, మోజ్‌ఫ్లిక్స్ ఉన్నాయి.
ఈ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లు తక్కువ బడ్జెట్‌లతో వెబ్ సిరీస్‌లు, సినిమాలను రూపొందిస్తూ అశ్లీల మరియు లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల కంటెంట్‌ను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఆయా ఓటీటీలపై కొరడా ఝుళిపించింది. సో.. ఇకపై ఆ ఓటీటీలన్ని బంద్ కానున్నాయి.