హైదరాబాద్ ప్రజలకు రవాణా కష్టాలు తీర్చే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార ప్రయత్నం జరిగిందంటూ.. గత నెల 22న వచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. కేవలం తన ప్రచారం కోసమే యువతి అలా పోలీసు లను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. వాస్తవానికి అన్నికోణాల్లోనూ విచారించిన తర్వాత.. సదరుయువతి ఇచ్చిన ఫిర్యా దు అవాస్తవమని తేల్చినట్టు తెలిపారు. దీంతో ఈ కేసును మూసి వేస్తున్నట్టు పేర్కొన్నారు. వాస్తవానికి తప్పుడు ఫిర్యాదు చేసి.. పోలీసుల సమయాన్ని హరించిన నేరంపై యువతిపై కేసు పెట్టవచ్చని.. కానీ, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూసేస్తున్నామని తెలిపారు.
రీల్స్ చేస్తూ..
తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన యువతికి రీల్స్ చేసి.. యూట్యూబ్‌లో పెట్టే అలవాటు ఉందని పోలీసులు తెలిపా రు. ఈ క్రమంలోనే మార్చి 22న కూడా.. ఆమె ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తూ.. రీల్స్ చేసిందని.. అయితే.. పొరపాటున జారి కింద పడిందని పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఇంట్లో చెబితే.. ఇబ్బంది అవుతుందని గ్రహించి.. తనపై అత్యాచార యత్నం జరిగిందని ఆరోపిస్తూ.. తల్లిదండ్రులకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తనపై అత్యాచారం జరిగిందంటూ కట్టుకథను అల్లేసిందని, ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొందని పేర్కొన్నారు.
పోలీసులు, ప్రభుత్వం కూడా.. ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్నాయి. అంతేకాదు.. మహిళల నుంచి కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎంఎంటీఎస్‌లోనూ రక్షణ లేదా? అన్న సందేహాలు కూడా వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు ప్రతిష్టాత్మ కంగా తీసుకుని దీనిపై విచారణ చేపట్టారు. సుమారు 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. వేలాది బైట్ల పుటేజ్‌ను పరిశీలిం చారు. అలానే అనుమానం ఉన్న 120 మంది యువతను కూడా స్టేషన్‌కు పిలిచి మరీ విచారించారు. ఇంత చేసినా ఎక్కడా ఆ యువతి ఆరోపణలకు ఆధారం లభించలేదు. దీంతో ఎందుకైనా మంచిదని సదరు యువతిని పిలిచి విచారించగా.. నిజం ఒప్పుకొంది. దీంతో కేసును మూసివేశారు.