వైసీపీలో 2 నుంచి 2వేల స్థానానికి సాయిరెడ్డి

News Image

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో త‌న పాత్ర ఏమీ లేద‌ని.. అయితే చ‌ర్చ‌ల్లో మాత్రం పాల్గున్నాన‌ని.. వైసీ పీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చెప్పారు. డ‌బ్బుల మూట‌లు చేతులుమారాయా? అన్న ది త‌న‌కు తెలియ‌ద‌ని.. ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ్ క‌సిరెడ్డిని అడిగితేనే అన్నీ తెలుస్తాయ‌ని అన్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కూడా.. విజ‌య‌వాడ‌లోని పోలీసు క‌మిష‌న‌ర్ ఆఫీసులో ఉన్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) సాయిరెడ్డిని ప్ర‌శ్నించింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చిన సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
నాకేం తెలీదు!
 
మ‌ద్యానికి సంబంధించి త‌న‌కుతెలిసింది మొత్తం సిట్ అదికారుల‌కు వెల్ల‌డించిన‌ట్టు సాయిరెడ్డి చెప్పారు. అయితే.. త‌న‌కు తెలిసిం ది పిస‌రంతేన‌ని.. పూర్తిగా వివ‌రాలు తెలియాలంటే.. మాత్రం క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డినే ప్ర‌శ్నించాల‌ని చెప్పాన‌న్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఎవ‌రికి ఎంత ముట్టింద‌న్న వివ‌రాలు.. దీనిలో పెద్ద వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యాలు అన్నీ క‌సిరెడ్డికే తెలుసున‌ని చెప్పారు. అయితే.. తాను విజ‌య‌వాడ‌లో ఒక‌సారి, హైద‌రాబాద్‌లో ఒక‌సారి నూత‌న మ‌ద్యం పాల‌సీపై చ‌ర్చించిన‌ప్పుడు పాల్గొ న్నాన‌ని చెప్పారు.
 
ఆ స‌మ‌యంలో రెండు కంపెనీల‌ను సిఫార‌సు చేసి.. వాటికి రూ.60 కోట్లు, 40 కోట్లు చొప్పున రుణాలు ఇప్పించాన‌న్నారు. ఆ నిధులు వారు ఎలా ఖ‌ర్చు చేశారో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. లిక్క‌ర్ విక్ర‌యాల విషయంలో ఎప్పుడూ తాను జోక్యం చేసుకోలేదని సాయిరెడ్డి సిట్‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. అధికారులు మ‌రోసారి త‌న‌ను పిలిచినా.. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌న్నారు.
 
2 నుంచి 2వేల స్థానానికి!
 
వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న తాను 2వేల స్థానానికి ప‌డిపోయాన‌ని సాయిరెడ్డి చెప్పారు. తాను తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు జ‌గ‌న్ మీడియా ప్ర‌చారం చేస్తోంద‌ని.. అయితే.. రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ వ‌స్తానా? రానా అనేది నా ఇష్ట‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించా రు. మ‌ళ్లీ రాకూడ‌ద‌ని ఏమీ ష‌ర‌తులు లేవ‌న్నారు. జ‌గ‌న్ చుట్టూ చేరిన కోట‌రీ కార‌ణంగానే తాను బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్నారు. వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని చెప్పిన మాట వాస్త‌వ‌మేన‌ని అయితే.. రాజ‌కీయాల్లో త‌న అవ‌స‌రం ఉంటుంద‌ని తెలిస్తే.. మ‌ళ్లీ వ‌స్తాన‌ని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ఎవ‌రూ అనుమ‌తి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Recent Comments
Leave a Comment

Related News