ఏపీ డిప్యూటీ సీఎం కం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలు ఆయన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తరచూ ఆయన ఏదో ఒక ఆరోగ్య ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు 74 ఏళ్లు కాగా.. పవన్ కల్యాణ్ వయసు 53 ఏళ్లు. ఇద్దరి మధ్య 21 ఏళ్ల వ్యత్యాసం ఉంది. చంద్రబాబు ఓపిగ్గా.. ఇప్పటికి చురుగ్గా.. అత్యంత తక్కువ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుంటే.. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం తరచూ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందులో పాల్గొనలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం షురూ కావాల్సి ఉంది. దీనికి ముందుగానే సచివాలయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. అయితే.. జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన నీరసంగా ఉండటంతో సచివాలయంలో ఉండలేకపోయారు.
ఒకదశలో వెనక్కి తిరిగి వెళ్లేందుకు లిఫ్టు వద్దకు వచ్చిన ఆయన.. అక్కడ నిలబడలేక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయారు. కాసేపటి తర్వాత కిందకు వచ్చి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత కాస్త కుదుట పడినట్లుగా చెబుతున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయంలోనే ఆర్థిక.. పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో పవన్ భేటీ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 53 ఏళ్లు అంటే మధ్య వయస్కుడిగా చెప్పాలి.
పవన్ లాంటి వారికి ఉండే వసతులు.. ఇతర సౌకర్యాలను పరిగణలోకి తీసుకుంటే ఆయన మరింత ఫిట్ గా ఉండాలి. అందుకు భిన్నంగా తరచూ అనారోగ్యానికి గురి కావటం జనసైనికుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సమకాలీన రాజకీయాల్లోని రాజకీయ అధినేతలు చంద్రబాబు.. కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డి.. ఇలా ఎవరిని చూసినా.. ఆఖరకు నరేంద్ర మోడీ లాంటి వారిని తీసుకున్నా.. పెద్దగా అనారోగ్యానికి గురైనట్లుగా కనిపించరు. అందుకు భిన్నంగా పవన్ పరిస్థితి ఉండటం గమనార్హం. ఇంతకూ ఆయన తరచూ ఎందుకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.