అట్టుడికిన న్యూయార్క్…ట్రంప్ నకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

admin
Published by Admin — April 20, 2025 in Politics
News Image

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ పరిపాలన తీరుకు నిరసనగా తాజాగా ఆ దేశ ప్రజలు మరోసారి తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్ నగరంలో ప్రత్యేకించి ఈ నిరసనలు ఎక్కువగా కనిపించాయి.

న్యూయార్క్‌లోని ప్రధాన గ్రంథాలయం బయట భారీ సంఖ్యలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు.. వలసదారులకు స్వాగతం అని వలసదారులకు మద్దతుగా నిరసనకారులు నిలిచారు. ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

కొద్ది రోజుల క్రితం ట్రంప్ నకు వ్యతిరేకంగా ‘హ్యాండ్సాఫ్‌’ పేరిట 50 రాష్ట్రాల్లోని దాదాపు 1,200 ప్రాంతాల్లో పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్‌జీబీటీక్యూ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్‌ సిటిజన్లు, ఎన్నికల సంస్కరణల సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో శాంతియుత నిరసన ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. అయినా సరే ట్రంప్ తీరు మారకపోవడంతో నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags
migrants protest against trump rights of migrants
Recent Comments
Leave a Comment

Related News