భారత్, పాక్ ఇద్దరూ దగ్గరే అంటోన్న ట్రంప్

admin
Published by Admin — April 26, 2025 in Politics
News Image

నమ్మకస్తుడైన స్నేహితుడు అన్న మాటకు అర్థం ఏమిటి? తప్పు చేసినోడు ఎవరన్నది ప్రపంచం మొత్తం చూస్తున్నా.. వాస్తవాల్ని పక్కన పెట్టేసి.. తమ ప్రయోజనాలు తప్పించి న్యాయం ఎటువైపు ఉందన్న విషయాన్ని పట్టించుకోని తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే అంటారు.. బలమైనోడిదే రాజ్యమని. భారత్ లో జరిగే ఉగ్రదాడి మూలాలు ఏమిటి? పాకిస్థాన్ ఏం చేస్తుందన్న విషయం ప్రపంచానికి తెలియంది కాదు. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ విషాద ఘటన జరిగిన రెండు రోజులకు అతడి నోటి నుంచి వచ్చిన మాటలో తేడా చూసినప్పుడు.. అగ్రరాజ్యం తీరు ఎలా ఉంటుందో అర్థమవుతుంది.

‘ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కశ్మీర్ విషయంలో భారత్.. పాక్ ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్తపని. ముష్కరుల దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవటం విచారకరం. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి’ అని చెప్పటం చూసినప్పుడు.. ఓర్నీ ట్రంప్ అనుకోకుండా ఉండలేం. పరిష్కారం రెండు దేశాలు కనుక్కుంటాయా? లేదా? అన్నది పక్కన పెట్టేస్తే.. తప్పుడు పనులు చేసిన దేశాన్ని తనకు సన్నిహితమైన దేశంగా పేర్కొనటం ఎలాంటి సంకేతాల్ని ఇచ్చినట్లు అవుతుంది? భారత్ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించే అమెరికా.. ఆ దేశంపై జరిగిన ఉగ్రదాడి వేళ.. అందుకు కారణమైన వారి సంగతి చూసే విషయంలో భారత్ కు మిత్రుడిగా అండగా ఉంటానని చెప్పటంతో పాటు.. పాకిస్థాన్ కు వార్నింగ్ ఎందుకు ఇవ్వరు?

సంబంధం ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయాల్ని కెలికేసే ట్రంప్.. ఉగ్రదాడి మూలాలన్నీ పాకిస్థాన్ లో ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న వేళలోనూ.. ఈ తరహా మాటల్ని ఎలా చూడాలి? అగ్రరాజ్యానికి కావాల్సింది మన మార్కెట్.. మన కారణంగా వచ్చే సంపద మాత్రమే తప్పించి మరింకేమీ కాదు. ఉగ్రపోరులోనూ.. పాక్ పీచమణిచే ఇష్యూలోనూ మనకు మనం స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉందే తప్పించి.. ఇతరుల మీద ఆధారపడటంలో అర్థం లేదు. ట్రంప్ తాజా మాటలు విన్న తర్వాత.. అగ్రరాజ్యం మీదా.. అప్పుడప్పుడు మన గురించి వారు చెప్పే మాటల్లో నిజం ఎంతన్నది ఇలాంటి సమయాల్లో ఇట్టే అర్థమవుతుంది. కాదంటారా?

Tags
both countries are equal India and Pakistan tension
Recent Comments
Leave a Comment

Related News