అన్ని '11'లే.. ఇదెక్క‌డి మాస్ ర్యాంగింగ్ సాయిరెడ్డి..?

admin
Published by Admin — October 21, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారో, ఏ వ్యూహంతో ముందుకు వస్తారో అంచనా వేయడం ఎవరివల్లా కాదు. సరిగ్గా ఇదే కోవలో ఇప్పుడు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) తీరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, జగన్‌మోహన్‌రెడ్డికి కుడిభుజంగా ఉన్న సాయిరెడ్డి.. ఇప్పుడు సొంతంగా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన పార్టీ పెడుతున్న తీరు, ఎంచుకున్న ముహూర్తం చూస్తుంటే.. కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, పాత బాస్‌పై ఆయన వేస్తున్న ఒక పక్కా వ్యూహాత్మక సెటైరికల్ అస్త్రం అని స్పష్టమవుతోంది.

నవంబర్ 11వ తేదీ ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక్కడ గమనించాల్సిన అసలు మ్యాటర్ ఏమిటంటే.. నెల 11, తేదీ 11, గంటలు 11, నిమిషాలు 11. ఇలా ఒకే ముహూర్తంలో ఏకంగా నాలుగుసార్లు '11' అనే అంకె రావడం యాధృచ్చికం అని కొట్టిపారేయలేం. అసలే 2024 ఎన్నికల్లో వైసీపీ(YCP)కి వచ్చింది సరిగ్గా 11 సీట్లే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ఆ పార్టీని 'ఎలెవెన్ పార్టీ' అంటూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది సరిగ్గా ఇదే నంబర్‌ను తన పార్టీ ఆవిర్భావ ముహూర్తంగా ఎంచుకోవడం వెనుక పెద్ద తంతంగమే ఉందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, కొత్త పార్టీ అజెండాలోని కీలక అంశాలు కూడా సరిగ్గా 11 ఉండటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. అడుగడుగునా అదే నంబర్‌ను రిపీట్ చేస్తూ సాయిరెడ్డి చేస్తున్న ఈ హడావుడి చూస్తుంటే.. పరోక్షంగా వైసీపీని, జగన్‌ను ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొత్త పార్టీ విధివిధానాలు, రాజకీయ ప్రసంగాల్లో సాయిరెడ్డి వైఖరి ఎలా ఉండబోతోందో ఆయన రీసెంట్ కామెంట్సే చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో తాము రెండు ప్రధాన పార్టీలకు మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటామని చెబుతూనే, అప్పుడప్పుడు టీడీపీ(TDP)పై పైకి విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఆయన అసలు గురి మాత్రం పూర్తిగా జగన్ మీదే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జగన్ మతాన్ని, వ్యక్తిగత విధానాలను పదే పదే ప్రస్తావిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపుతున్నాయి.

'రప్పా రప్పా రాజకీయాలు', 'మత పిచ్చి' అంటూ సాయిరెడ్డి సంధిస్తున్న అస్త్రాలు చూస్తుంటే.. పాత అనుబంధాలను పూర్తిగా పక్కనబెట్టి, ఇకపై లెక్కలు వేరేలా ఉంటాయని ఆయన సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి, తన రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఏకంగా '11' నంబర్ సెంటిమెంట్‌తో, పాత బాస్‌ను ఇరుకున పెట్టే సెటైరికల్ వ్యూహంతో సాయిరెడ్డి షురూ చేస్తుండటం ఏపీ(AP) పాలిటిక్స్‌లో ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. మరి నవంబర్ 11న ఆయన ఏ రకమైన బాంబులు పేల్చనున్నారు, ఈ '11' రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags
Vijayasai Reddy Andhra Pradesh AP Politics YSRCP TDP AP News YS Jagan Mohan Reddy
Recent Comments
Leave a Comment

Related News