కేతిరెడ్డి పెద్దారెడ్డి. వైసీపీ నాయకుడు, అనంతరపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. అయితే.. ఆయన ఓడిపోయినా.. తనదే పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఇటు వ్యక్తిగతంగా ఆయన, అటు రాజకీ య పరంగా వైసీపీకూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ నేత, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం..ఫర్నిచర్ ధ్వంసం చేయడం వంటివి రచ్చకు దారితీశాయి. ఆ తర్వాత.. పార్టీ ఓడి.. తాను కూడా ఘోర పరాజయం చవిచూసినా.. పెద్దారెడ్డిలో పెద్దగా మార్పు రావడం లేదు.
తాజాగా.. బెదిరింపులు!
తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్లు వేస్తే అంతుచూస్తామంటూ బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో తాడిపత్రి పోలీసులు పెద్దారెడ్డి కేసు నమోదు చేశారు. తాడిపత్రి టీడిపి పట్టణ అధ్యక్షుడు టింకర్ హజీభాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై బీఎన్ ఎస్ సెక్షన్లు 192, 351(2), 223 ల ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసు లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను ఉద్దేశించి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడిని, ఉద్రిక్తతను పెంచాయి. ఈ వ్యవ హారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు.
అనలేదు: కేతిరెడ్డి
కాగా.. తాను ఎవరినీ బెదిరించలేదని.. తాను బెదిరించినట్టుగా నకలీ వీడియో సృష్టించారని కేతిరెడ్డి చెబుతున్నారు. అయితే.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం పెద్దారెడ్డి బెదిరించారనే అంటున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని రాష్ట్ర హోం శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఆది నుంచి కూడా పెద్దారెడ్డిపై విమర్శలు రావడం.. ఆయన దూకుడుగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉన్న నేపథ్యంలోతాజా పరిణామం మరింత తీవ్రంగా మారనుంది. కీలకమైన ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి చిక్కుల్లో పడడం, కేసు నమదు కావడం పార్టీకి, ఆయనకు కూడా నష్టం కలిగిస్తాయని అంటున్నారు.