ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన హీట్ ఉంటుంది. రాయలసీమ పాలిటిక్స్‌లో పరిటాల కుటుంబం పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తున్న నయా చర్చ ఇప్పుడు అనంత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్(Paritala Sriram)ను ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టేలా అధిష్టానం పావులు కదుపుతుందనే ప్రచారం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా వచ్చింది. ఆ రోజుల్లో జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ పదవి వైసీపీ(YCP) ఖాతాలోకి వెళ్లింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లా అంతటా పార్టీ పట్టును మరింత గట్టిగా బిగించాలని, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని టీడీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేడర్‌లో సరికొత్త జోష్ నింపేందుకు ఒక బలమైన జననేతను జడ్పీ పగ్గాలపై కూర్చోబెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ వ్యూహం వెనుక ఒక పక్కా పాలిటికల్ ప్లాన్ కూడా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉంటూ శాసనసభలో తనదైన ముద్ర వేస్తుండగా, మరోవైపు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే ఇక ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లా పాలనా వ్యవహారాలన్నీ వారి కంట్రోల్లోకి వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల అటు పార్టీ శ్రేణులకు నిరంతరం అండగా ఉండటమే కాకుండా, అధికార యంత్రాంగంపై కూడా పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు పరిటాల కుటుంబానికి ఇది తిరుగులేని అవకాశాన్ని ఇస్తుంది.
ఒకరి చేతిలో శాసనసభ, మరోరి చేతిలో జిల్లా పరిషత్ పగ్గాలు ఉంటే ఆ జిల్లాలో ఆ కుటుంబం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్తలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ(TDP) క్యాడర్లో పండగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుంచి రచ్చబండ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. మొత్తానికి పరిటాల శ్రీరామ్‌కు తగనున్న ఈ కొత్త కిరీటం అనంత రాజకీయాల్లో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.