బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కేటీఆర్ పై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత మండిపడ్డారు. కేటీఆర్ తన చేతగానితనాన్ని కేసీఆర్ పై నెట్టడం ఏంటని కవిత ప్రశ్నించారు. పార్టీ వైఫల్యాలను పార్టీ అధినేతపై మోపడం సరికాదని హితవు పలికారు.
ఒక గుంట నక్క మైండ్ గేమ్ లో కేటీఆర్ పడ్డారని, కాబట్టే పార్టీ అధినేతనే తప్పుపట్టే స్థాయికి వెళ్లారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తనతో పెట్టుకోవద్దని, తన దగ్గర నిర్దిష్టమైన ఆధారాలున్నాయని, తనను రెచ్చగొడితే అవన్నీ బయట పెడతానని కేటీఆర్ కు కవిత వార్నింగ్ ఇచ్చారు.
నియోజకవర్గానికి ఎమ్మెల్యేని సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు తమ దృష్టికి రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఈ విధంగా స్పందించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న రీతిలో పార్టీ వైఫల్యాలను కేసీఆర్ పై కేటీఆర్ మోపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలా చేసి బీఆర్ఎస్ కు గోతులు తీస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఫామ్ హౌస్ లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా స్నేహితులకు చేకూర్చిన ప్రయోజనాలు, క్విడ్ ప్రోకో వ్యవహారాలతోనే బీఆర్ఎస్ ను కేటీఆర్ పాతాళంలోకి నెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సమావేశం సందర్భంగా ఒక రైతు ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన భార్యను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ... ఓ మహిళతో అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. తాను విష నాగుల మాటలు విని ఇలా మాట్లాడటం లేదని నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడతానని కవిత చెప్పారు.