40 కోట్ల మోసం.. పూరి-ఛార్మి బండారం బయటపెట్టిన నిర్మాత.!

admin
Published by Admin — September 29, 2026 in Movies
News Image

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) కెరీర్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో కొనసాగుతోంది. వరుస పరాజయాలు ఆయనను సతమతం చేస్తుంటే, తాజాగా ఆయనపై వస్తున్న ఆర్థికపరమైన ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. 'లైగర్' తెచ్చిన నష్టాల నుంచి బయటకు రాకముందే, 'డబుల్ ఇస్మార్ట్' రూపంలో తగిలిన దెబ్బ చిత్రయూనిట్‌ను, ముఖ్యంగా కొనుగోలు చేసిన బయ్యర్లను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత చైతన్య రెడ్డి పూరి జగన్నాథ్, ఛార్మిలపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.

'డబుల్ ఇస్మార్ట్(Double iSmart)' సినిమాను ప్రైమ్ షో సంస్థ భారీ ధరకు, దాదాపు 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ సంస్థ తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే సినిమా విడుదల కాకముందే, ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మరో సినిమా చేసి పెడతానని పూరి జగన్నాథ్ స్వయంగా మాట ఇచ్చారట. కానీ సినిమా ఫ్లాప్ అయ్యాక ఆ మాటను పూర్తిగా గాలికొదిలేశారనేది నిర్మాత ప్రధాన ఆరోపణ.

సినిమా రిజల్ట్ బయటికి రాగానే పూరి, ఛార్మి(Charmy Kaur)లిద్దరూ పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారని, కనీసం ఫోన్‌లు కూడా ఎత్తకుండా తమ నెంబర్లను బ్లాక్ చేశారని చైతన్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయడం అంటే ఇదేనంటూ  ఆమె వాపోయిన తీరు సినిమా సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. బాధిత నిర్మాత స్వయంగా ముంబై వెళ్లి పూరి జగన్నాథ్‌ను కలిస్తే అక్కడ మరో షాకింగ్ నిజం బయటపడింది. నష్టపోయిన బయ్యర్‌ను ఆదుకోవడానికి బదులుగా పూరి జగన్నాథ్ పెట్టిన కండీషన్లు వింటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. తనకు నచ్చిన కథే తీస్తానని, పైగా రెమ్యునిరేషన్‌గా రూ. 15 కోట్లు ఇవ్వాలని, వచ్చే లాభాల్లో ఏకంగా 50 శాతం వాటా తనకే ఇవ్వాలని షరతులు పెట్టారట. ఆల్రెడీ 40 కోట్లు నష్టపోయి, అదే డైరెక్టర్‌కు మళ్లీ కోట్లు కుమ్మరించి, సగం లాభాలు పంచడం ఏ నిర్మాతకైనా సాధ్యమయ్యే పనేనా? ఈ దారుణమైన ప్రతిపాదనల వల్లే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేకపోయిందని చైతన్య చెప్పుకొచ్చారు. 

కాగా, వ్యాపారంలో లాభనష్టాలు సహజమే అయినప్పటికీ, ఇచ్చిన మాటపై నిలబడకపోవడం ఇక్కడ అసలు సమస్యగా మారింది. పూరి పడిలేచే మెంటాలిటీ ఉన్నవాడే కావొచ్చు.. త్వరలో రాబోయే 'స్లమ్ డాగ్(Slum Dog)' సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకోవచ్చు. కానీ, గడచిన చిత్రాల ఫైనాన్స్ సమస్యలు, బకాయిలు ఈ కొత్త సినిమాను తీవ్రంగా వెంటాడేలా కనిపిస్తున్నాయి. 'స్లమ్ డాగ్' విడుదలకు ముందే చైతన్య రెడ్డి లాంటి బాధితురాలు తమ సమస్యను తేల్చుకోవడానికి మళ్లీ రోడ్డెక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ వివాదాలు, అప్పుల ఉచ్చులను దాటుకుని పూరి తన కొత్త సినిమాతో ఎలా బయటపడతారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Tags
Puri Jagannadh Slum Dog Double iSmart Charmy Kaur Prime Show Entertainments Chaitanya Reddy Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News