కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం. అదే మాదిరిగా కూటమి అన్న తర్వాత కూటమిలోని వివిధ పార్టీల మధ్య పొరపచ్ఛాలు రావడం కూడా అంతే సహజం. ఒక చేతికి ఉన్న ఐదు వేళ్లు ఒకలా ఉండవు. అటువంటిది రాజకీయపరంగా వేర్వేరు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలుండడం సహజం. ఆ విభేదాలు, చిన్న చిన్న సమస్యలు పక్కనబెట్టి కూటమిలోని పార్టీలు ఐక్యంగా ముందుకు సాగితేనే అనుకన్న ఫలితాలు సాధించగలవు. ఈ విషయంపై ఏపీలోని ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీల నాయకత్వంలో ఎలాంటి సమస్యా లేదని, క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య అదే క్లారిటీ ఉండాలని లోకేశ్ చెప్పారు. 2029 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని, ఒకవేళ తనకు ఏదైనా డౌట్ డౌట్ వస్తే పవన్ అన్నకు ఫోన్ చేసి ఏం చేద్దాం అని అడుగుతానని చెప్పారు. అదే మాదిరిగా పవన్ అన్నకు ఏమన్నా ఉంటే తనకు ఫోన్ చేసి...అరె లోకేశ్ ఇట్లా ఉందిరా...ఏం చేద్దాం అని తనను అడుగుతాడని లోకేశ్ అన్నారు.
ఓ కాంక్లేవ్ సందర్భంగా 2029లో కూటమి మరోసారి కలిసి పోటీ చేస్తుందని తాను చెప్పిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత పవన్ అన్న తనకు ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. 2029తో కలిపి కనీసం 3 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పకుండా ఒక ఎన్నిక అని ఎందుకు చెప్పావ్ అని తనను ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని, పాలనను గాడిలో పెట్టాలంటే కూటమి మరో 15 ఏళ్లపాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు. టీడీపీది కోటి మంది కుటుంబం అని, జనసేన, బీజేపీ కలిశాక అది మరింత పెద్ద కుటుంబంగా మారిందని అన్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.