వైసీపీ గ‌తాన్ని త‌వ్వితే.. క‌న్నీళ్లే!

admin
Published by Admin — September 07, 2026 in Politics
News Image

ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు... ఉపాధ్యాయులు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు చ‌దువులు చెప్పే గురువులు.. తాజాగా సీఎం చంద్ర‌బాబు ముందు క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు. ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన అధికారిక కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు 173 మందికి ఉత్త‌మ ఉపాధ్యాయులుగా సీఎం చంద్ర‌బాబు అవార్డులు అందించారు. ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని, వైసీపీ హ‌యాంలో ఉన్న ప‌రిస్థితిని త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

వైసీపీ హ‌యాంలో త‌మ‌కు విలువ‌లేకుండా చేశార‌ని ప‌లువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలోలిక్క‌ర్ షాపుల ముందు త‌మ‌ను కాప‌లా పెట్టార‌ని.. అదేమని ప్ర‌శ్నిస్తే.. ప్ర‌మోష‌న్లు రాకుండా ఆపేశార‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, మ‌రికొంద‌రు.. విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన బాత్ రూమ్‌ల‌లో శుభ్ర‌త విష‌యంలో అప్ప‌టి ప్ర‌భుత్వం త‌మ‌ను ఫొటోలు తీసి పెట్టాల‌ని ఒత్తిడి చేసిన‌ట్టు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల‌.. తామే బాత్ రూమ్‌లు శుభ్రం చేయాల్సి వ‌చ్చేదని గుర్తు చేసుకున్నారు. ఇక‌, విధుల్లో కంటే కూడా.. యాప్‌ల‌లోనే త‌మ కాలం గ‌డిచిపోయింద‌ని చెప్పుకొచ్చారు.

కేసులు తీసేయండి..

త‌మ‌కు రావాల్సిన బ‌కాయిలు, ఇంక్రిమెంట్ల కోసం ఉద్య‌మానికి పిలుపునిస్తే.. ఇళ్ల‌వ‌ద్దే నిర్బంధించార‌ని.. కొంద‌రిపై తీవ్ర‌మైన నేరాలు మోపి వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కేసులు పెట్టార‌ని తెలిపారు. వాటిని తొల‌గించాల‌ని.. న్యాయ‌ప‌రంగా పోరాటం చేసే ఓపిక త‌మ‌కు లేద‌ని ప‌లువురు ఉపాధ్యాయులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇక‌, ప్ర‌స్తుత ప్ర‌భుత్వ విష‌యానికి వ‌స్తే.. డీఎస్సీ ద్వారా కొత్త కొలువులు సృష్టించి.. త‌మ‌పై ఉన్న భారాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నంచేస్తోంద‌ని తెలిపారు. అలానే.. యాప్‌ల సంస్కృతిని త‌గ్గించ‌డం ద్వారా విద్యార్థుల‌కు బోధ‌న‌ను మ‌రింత చేరువ చేసేందుకు మార్గం సుగ‌మం చేసింద‌న్నారు.

చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే..

ఉపాధ్యాయులు స‌మాజాన్ని తీర్చిదిద్దే గురువుల‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే స‌మాజం బాగుంటుంద‌న్నారు. అందుకే త‌మ ప్ర‌భుత్వం గురువుల‌కు గౌర‌వం ఇస్తోంద‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల‌ను లిక్క‌ర్ షాపుల ముందు కాప‌లా పెట్టిన విష‌యం తెలిసిన వెంటనే తాను ఖండించాన‌ని గుర్తు చేశారు. త‌మ పార్టీ త‌ర‌ఫున ఉద్య‌మానికి మాద్ద‌తు ఇచ్చాన‌ని తెలిపారు. ఉపాధ్యాయుల‌ను గౌర‌వించ‌ని ప్ర‌భుత్వాలు మ‌న‌లేవ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల‌కు మరింత గౌర‌వం ద‌క్కేలా చూస్తామ‌ని తెలిపారు. కేసుల విష‌యంలో న్యాయ నిపుణుల‌తో స‌మీక్షించి.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 

Tags
Ycp regime teachers remembering those days
Recent Comments
Leave a Comment

Related News