తెలంగాణ(Telangana) శాసనసభ సమావేశాల తొలి రోజే రాజకీయ రణరంగంగా మారింది. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా వీధులకు పాకింది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎత్తిచూపేందుకు నల్లటి టీషర్టులతో నిరసనగా వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది.
అసెంబ్లీ గేట్ల వద్దే పోలీసులు భారీ మోహరింపుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో పరిస్థితి అంతులేని గందరగోళానికి దారితీసింది. లోపలికి వెళ్లేందుకు యత్నించిన గులాబీ దళ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రతిపక్ష నేతలు కేటీఆర్(KTR), హరీశ్‌రావులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ఈ ఘర్షణ వాతావరణం కేవలం అరెస్టులతోనే ఆగిపోలేదు. పోలీసుల తీరుపై నిరసనగా బీఆర్ఎస్(BRS) నాయకులు తమ టీషర్టులను విప్పి, బనియన్లతోనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. ఈ తోపులాటలో మహిళా ఎమ్మెల్యేలు కిందపడిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్దే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరును తలచుకుని కన్నీటిపర్యూమవడం అందరినీ కలచివేసింది. అదే సమయంలో మరో సీనియర్ నేత జగదీశ్ రెడ్డి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల అమానుష వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
మరోవైపు, సభ లోపల కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 22ఏ వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కీలక అంశాలపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయించగా, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తొలి రోజే అరెస్టులు, నిరసనలు, స్పృహతప్పి పడిపోవడం వంటి నాటకీయ పరిణామాలతో రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మరింత హీటెక్కడం ఖాయమని స్పష్టమవుతోంది.