ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరోసారి ఉత్తరాంధ్ర పాలిటిక్స్ హీటెక్కాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన త్వరలోనే ఫ్యాన్ వదిలి జనసేన కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ రకరకాల ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు ఈ రూమర్స్‌కు ఆజ్యం పోసింది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కావడం విశేషం. ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నేత త్వరలోనే పార్టీ మారతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలను గందరగోళంలోకి నెట్టేశాయి.
అయితే ఈ ప్రచారంపై బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తనదైన శైలిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. అసలు కేబినెట్ మీటింగ్‌లకు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ఎలా ఖాళీగా ఉంటున్నారో, ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా అలాగే ఖాళీగా ఉండి ఇలాంటి లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అధినాయకత్వం కూడా ఈ జంపింగ్ టాక్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోయినా, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటూనే ఉంది.
ఈ రాజకీయ మైండ్‌గేమ్ వెనుక అసలు కథ వేరే ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. బొత్స సత్యనారాయణ తన కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రస్తుతం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు సందీప్‌ను 2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బరిలోకి దించడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె అనూష(Botsa Anusha)ను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలిపించుకోవాలని ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో తన పట్టును మరింత బలపేతం చేసుకునే పనిలో బొత్స బిజీగా ఉంటే, సరిగ్గా ఇదే సమయంలో ఆయన పార్టీ మార్పుపై బురద జల్లడం వెనుక సొంత పార్టీలోని కొందరి హస్తం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బొత్స జంపింగ్ రూమర్స్ కేవలం పుకార్లా లేక రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జరగబోయే బిగ్ పరిణామాలకు ఇవి ముందస్తు సంకేతాలా అనేది కాలమే నిర్ణయించాలి.