తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ఆడపడుచులకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుకలను పంపించారు. 10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను అందించారు. స్థానిక శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేయించారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం అంగరంగ వైబభవంగా సాగింది.
పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని కూడా ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు.
తొలుత జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు.