``మీ రాజకీయాలు మాతో వద్దు. ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోండి. కోర్టుల సమయాన్ని వృథా చేయ కండి`` అని వైసీపీని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలుపుద ల చేశారని.. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా మరి కొందరు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిని విచారణకు తీసుకున్న కోర్టు.. మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియా కేసులపై ఇప్పటికే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని కోర్టు పేర్కొంది. అయి నప్పటికీ.. రాజకీయ దురుద్దేశంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. తమ సమయం వృథా చేస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో వస్తున్న పిటిషన్లను విచారిస్తూ కూర్చుంటే.. సమయం సరిపోదన్న ధర్మాసనం .. లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అదేసమయంలో ప్రభుత్వం కూడా సంయమనం పాటించాలని సూచించింది.
అలాగే.. సీఐడీ పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై నమోదు చేసిన కేసుల విషయాన్ని పరిశీలిం చాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై వాదనలు అవసరం లేదని న్యాయమూర్తు లు దీపాంకర్ దత్తా, షీల్ నాగ్‌లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని, పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకు.. హైకోర్టు ఉందని పేర్కొన్న ధర్మాసనం.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
విషయంఏంటి?
వైసీపీకి చెందిన సోషల్ మీడియాలు.. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటివాటిని అనాధరైజ్డ్‌గా మూసి వేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ప్రభుత్వమే చేయిస్తున్న పనిగా పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఇలాంటి వాటిని అడ్డుకోవాలని తొలుత హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఇక్కడ ఎదురు దెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో సమాచారం షేర్ చేస్తున్న వారిపైనా క్రిమినల్ కేసులు పెడుతున్నారని వైసీపీ చెబుతోంది. ఈ కేసులురద్దు చేయాలని కోరుతోంది.