విశాఖ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సమావేశాలలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గాలా డిన్నర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ ప్రతిష్ఠాత్మక సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమన్నారు.
తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. "సిటీ ఆఫ్ డెస్టినీ"గా పేరుగాంచిన విశాఖపట్నం, భారత తూర్పు తీరానికి ఒక ఆభరణం వంటిదని అభివర్ణించారు. ఉద్యోగ, ప్రతిభా రంగాల్లో వరుసగా రెండో ఏడాది దేశంలోనే 'నంబర్‌వన్ సిటీ ఆన్ ద రైజ్'గా విశాఖ గుర్తింపు పొందిందనివ్యూహాత్మక మారిటైమ్ గేట్‌వేగా, టెక్నాలజీ-ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతున్న విశాఖ, నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.